మెదక్ | ఆగస్టు 18:
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ప్రజల నుంచి వచ్చిన 11 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.
పిర్యాదు దారుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్‌ల ఎస్ఐలు, సీఐలతో మాట్లాడి మార్గదర్శకాలు అందించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయము లేకుండా, మూడో వ్యక్తి జోక్యం లేకుండా, స్వేచ్ఛగా పోలీసు సేవలు పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరిస్తూ, వేగవంతంగా పరిష్కరించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు, ప్రజలకి మరింత దగ్గరగా ఉండేలా పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.