– కరీంనగర్లో నిర్వహించాల్సిన బీసీ సభను బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచనలు రావడమే దీనికి కారణం.
హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; భారత రాష్ట్ర సమితి ఆగస్టు 8న కరీంనగర్లో నిర్వహించాల్సిన బీసీ గర్జన సభను వాయిదా వేసింది. ఈ సభను ఆగస్టు 14, 2025కు మార్చినట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అదే రోజు ఇతర సభల తేదీలను కూడా ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు.
బీసీ గర్జన సభను స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీల రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, ఈ వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ తన ఎన్నికల వాగ్దానాలను మరచిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన చారి విమర్శిచారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్, తెలంగాణలో బీసీ సామాజిక వర్గాల హక్కుల కోసం పోరాటాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన సభను ఆగస్టు 14న కరీంనగర్‌లోనే నిరవహిస్తారు.
‘మేమెంతో మాకంతా’ నినాదంతో బీఆర్ఎస్ ఈ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటోంది. కరీంనగర్‌లోని జ్యోతిరావు ఫూలే మైదానంలో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే కాదు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ తేల్చంది.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి బీఆర్ఎస్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లు సాధ్యం కాదు కాబట్టి.. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని.. రాజకీయ పరంగా.. బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి.. ఎన్నికలకు వెళ్తే మిగతా పార్టీలపై ఒత్తిడి పెంచినట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తే ఇతర పార్టీలు విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతి, పార్లమెంట్‌పై ఒత్తిడి తేకుండా ఢిల్లీలో ధర్నాలు చేశారని.. ధర్నాకు రాహుల్ కూడా రాలేదని కాంగ్రెస్ హైకమాండ్ బీసీలకు అన్యాయం చేస్తోందని అంటున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్ తెచ్చారని అది రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ అంటోంది. కరీంనగర్ బీఆర్ఎస్కు సెంటిమెంట్ కలిగిన ప్రాంతంగా ఉందని, రాష్ట్ర సాధన పోరాటంలా బీసీ ఉద్యమాన్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు పట్టుదలగా ఉన్నారు.