టైం వచ్చినప్పుడు బండారం బయటపెడ్త.
భూములు, కాంట్రాక్టులు, ఇసుక లూటీ.
ప్రతిపక్షాన్ని తిట్టడం తప్ప చేస్తున్నదేంది?
మూడున్నరేండ్లే రేవంత్ ముఖ్యమంత్రి.
హైదరాబాద్, ఆగస్టు 6 :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారందరూ కలిసి తెలంగాణ సంపదను లూటీ చేస్తున్నారని, కాంట్రాక్టులు, భూములు, ఇసుక మాఫియా విషయాల్లో కానీ, తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతానని చెప్పారు. గతంలో మాదిరిగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి తెలంగాణలో కోట్ల రూపాయలు దోచుకుంటామంటే కుదరదని స్పష్టంచేశారు. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం కానీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. పదవుల కోసం దిగజారి ప్రవర్తించలేమని చెప్పారు.
తెలంగాణ ప్రజల కోసం ఎటువంటి త్యాగమైనా సిద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు రజనీకాంత్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేది మరో మూడున్నరేండ్లు మాత్రమేనని, ఆ తర్వాత ఎవరు అనేది ఎన్నికల తర్వాత చూద్దామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ప్రభుత్వం ఏర్పడిన ఈ 20 నెలల్లో ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని తిట్టడం, ఆవేశపూరిత ప్రసంగాల వల్ల ఉపయోగమేంటని నిలదీశారు. ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా మాటలు తగ్గించి, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చెప్పాలని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. ప్రజలు చెప్పిందే తాను చెప్తున్నానని, తాను వ్యక్తిగతంగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. సీఎం ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పాలని సూచించారు. రేవంత్‌రెడ్డి తన భాష మార్చుకోవాని సూచించారు. తనకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందని మరోసారి గుర్తుచేశారు. తన మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి తెలియదని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.
బీఆర్‌ఎస్‌లోకి వెళ్తే ఎప్పుడో మంత్రి పదవి వచ్చేది.
తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లి ఉంటే కేసీఆర్ తనకు ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తినైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉండేవాడినే కాదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొచ్చానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం హామీ మేరకే కాంగ్రెస్‌లోకి వచ్చి పోరాటం చేస్తున్నానని, ప్రజల పక్షాన పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 20 నెలలైనా తనకు మంత్రి పదవి రానందుకు బాధలేదని చెప్పారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా జరిపించాలని పేర్కొన్నారు. భాష, హావభావాలు మార్చుకుని మంత్రివర్గంలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని రేవంత్‌కు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షిస్తామని అన్నారని, కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
రేవంత్‌ను విమర్శించడం లేదు.
సీఎం రేవంత్‌రెడ్డికి తాను సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నానని, విమర్శలు చేయడం లేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సీఎం అయినా, మంత్రులైనా డిజిటల్ మీడియా సోదరులను అవమానించకూడదని హితవు పలికారు. ఉద్యమంలో బాసటగా నిలిచిన సోషల్ మీడియాపై సీఎం వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డిజిటల్ మీడియా పని చేసిన తీరును ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభినందించారు. పోరాడిన డిజిటల్ మీడియా ప్రతినిధులను గౌరవించుకోవాలి తప్పితే అవమానించడం సబబు కాదని పేర్కొన్నారు. సోషల మీడియా విషయంలో ‘ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న’ అన్నట్టు రేవంత్‌రెడ్డి వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఎవరి సొత్తు కాదని, అహంకారపూరిత పాలన చేయడం మంచిది కాదని హితవు పలికారు.
ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రమని, రాష్ట్ర సాధనలో ప్రతి ఒకరి పాత్ర ఉందని గుర్తుచేశారు. అధికారం, పదవులు శాశ్వతం కాదని అన్నారు. తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌కు వచ్చానని, బీజేపీలో తనకు మంచి గౌరవం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చానని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిజిటల్ మీడియాను ఉద్దేశించి చులకనగా, అవమానకరంగా మాట్లాడితే బాధనిపించి మంచి పద్ధతి కాదని ట్వీట్ చేశానని స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన సాగించే ప్రభుత్వమే మనకు కావాలని, అటువంటి పాలకులే కావాలని రాజగోపాల్‌రెడ్డి వివరించారు.
*డీకే శివకుమార్‌తో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భేటీ.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన డీకేతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయాల గురించి వీరు చర్చించినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో పార్టీలో చేరేటప్పుడు అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని.. తన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి కూడా పదవులు ఇస్తున్నప్పటికీ తనకు మాత్రం ఇవ్వడంలేదని ఈ సందర్భంగా డీకేకు వివరించినట్టు తెలిసింది. అధిష్ఠానమే మాటతప్పితే పార్టీ క్యాడర్‌కు నమ్మకం పోతుందన్న విషయా న్ని హైకమాండ్‌కు గుర్తుచేయాలని కోరారు.