ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన సుప్రీం కోర్టు తీర్పు కీలకంగా మారుతోంది. అనర్హత పిటీషన్ ల పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
అనర్హత పిటీషన్ల పైన సుదీర్ఘ విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం.. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు తీర్పు వెలువరించారు. ఈ తీర్పు పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఓ చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సీజేఐకి ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు నిరూపించిందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం కీలక ఆదేశాలు, ఇక..
రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే తాను చెప్పిన నీతులకు కట్టుబడి ఉండాలని కేటీఆర్ సవాల్ విసిరారు. చట్టవిరుద్ధంగా 10 మంది పార్టీ మారారని చెప్పేందుకు దర్యాప్తు అవసరం లేదన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికకు 3 నెలల సమయం ఉందని, పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏళ్ల తరబడి పిటిషన్లను పెండింగ్‌లో పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీం తాజా తీర్పుతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.