హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం జులై 29) రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌ని కాలుష్యరహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని అధికారులని ఆదేశించారు. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్‌లని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గ నిర్దేశం చేశారు. కోర్ అర్బన్ రీజియన్‌లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని.. ఇందుకు సంబంధించి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు..