*మూడు నెలల నుంచి లబ్ధిదారుల ఎదురుచూపు.
*బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మూడు, నాలుగు మాసాలుగా వంట గ్యాస్ సబ్సిడీ అందడం లేదు.
గ్యాస్ డెలివరీ అయిన తర్వాత వారం, పది రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన గ్యాస్ సబ్సిడీ జమ కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పథకం ఆరంభమైన తర్వాత కొద్ది రోజుల వరకు సబ్సిడీ సొమ్ము జమ అయినప్పటికీ మూడు, నాలుగు మాసాల నుంచి జమ కావడం లేదని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమ ఖాతాలను చెక్ చేసుకుంటున్నారు. సబ్సిడీ సొమ్ము జమ కాలేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు.
ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, మహిళా సంఘాల సభ్యులకు నెల నెలా 2,500 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం, 500 రూపాయలకే వంట గ్యాస్ సబ్సిడీ పథకం ఉంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆరంభించారు. అలాగే 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామసభలను నిర్వహించారు. ఈ సభల్లో ఐదు గ్యారంటీ పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అందులో గ్యాస్ సబ్సిడీ కోసం 2,01,996 కుటుంబాలకు చెందిన వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది మార్చిలో 500 రూపాయలకే వంట గ్యాస్ సబ్సిడీ పథకాన్ని ఆరంభిం చారు. కొన్ని రోజుల పాటు సబ్సిడీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినప్పటికీ, మూడు, నాలుగు నెలల నుంచి సబ్సిడీ సొమ్ము జమ కావడం లేదని చెబుతు న్నారు. ప్రస్తుతం సిలిండర్ ధర 915 రూపాయలు ఉండగా, లబ్ధిదారులు ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 40.71 రూపాయల వరకు సబ్సిడీ జమ చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 374 రూపాయల సబ్సిడీ జమ చేయాల్సి ఉంది. అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ సబ్సిడీ గ్యాస్ పథకం వర్తించడం లేదు. ఆన్‌లైన్‌లో సక్రమంగా పేర్లు నమోదు చేయక, ఇతరత్రా ఇబ్బందులు, ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇవ్వక పోవడం వల్ల వారికి పథకం వర్తించడం లేదు. ప్రభుత్వం స్పందించి సబ్సిడీ సొమ్మును విడుదల చేసి, పథకం వర్తించని వారికి దరఖాస్తు చేసుకునేందుకు, దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. సబ్సిడీ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ డీఎస్‌వో కె శ్రీనాథ్‌ను వివరణ కోరగా గ్యాస్ సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నది. ఎంత మందికి జమ అవుతుందనే విషయం తెలియడం లేదు. సబ్సిడీ పడని విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుక వెళతానని పేర్కొన్నారు.