ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీకి పోటీ చేయటానికి నోచాన్స్.
కుటుంబంలోని ఓటర్లు అందరికీ ఒకే పోలింగ్‌బూత్‌లో ఓటు హక్కు.
ఎంపీటీసీకి గులాబీ, జడ్పీటీసీ ఎన్నికకు తెలుపు బ్యాలెట్ పేపర్లు.
స్థానిక ఎన్నికల్లోనూ నోటా!
జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు:
హైదరాబాద్, జూలై 26 గతంలో ఒక అభ్యర్థి అనేక పదవులకు పోటీచేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక్క పదవికే పోటీపడాలనే నిబంధనను తీసుకురానున్నట్టు సమాచారం. ఒక అభ్యర్థి ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోటీచేసే అవకాశమూ ఈసారి ఉండబోదని తెలుస్తున్నది. ఇలా ఈసారి స్థానిక ఎన్నికల్లో అనేక కొత్త నిబంధనలను అమలు చేయనున్నారని తెలుస్తున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల చిక్కుముడి వీడకపోయినా, షెడ్యూల్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను విభజించారు. చనిపోయినవారి పేర్లను తొలగించి, కొత్తగా ఓటర్లను చేర్చి నూతన జాబితాను రూపొందించారు.
కొత్తగా నోటాను తీసుకొస్తున్నారు. 2004 నుంచి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో మాత్రమే అమలులో ఉన్న నోటా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ అమలు చేయనున్నారు. ఈ మేరకు బ్యాలెట్ పేపర్లలో నోటాను ముద్రించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నికల అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఎంపీటీసీ పోలింగ్ కోసం గులాబీ, జడ్పీటీసీ ఎన్నిక కోసం తెలుపు రంగు బ్యాలెట్ల పేపర్లను సిద్ధం చేస్తున్నారు. గతంలో మండలం యూనిట్ తీసుకున్నందున ఒక కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే కొన్నిసార్లు వారి ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండేవి. ఈసారి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నందున కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఓటు వేసేలా చర్యలు తీసుకోనున్నారు. కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల నాటికి కొత్త ఓటర్లకు చాన్స్:
ఎన్నికల నాటికి కొత్త ఓటర్ల చేరిక, ఉన్నవారిలో మార్పులు, చేర్పులకు దరఖాస్తులను ఆహ్వానిస్తే వారి వివరాలతో వార్డుల వారీగా అనుబంధ జాబితానూ రూపొందిస్తారు. బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలను అధికారులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. గతంలో ఉన్న బ్యాలెట్లు, సీళ్లను పరిశీలించాలని ఇప్పటికే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన ఆదేశించారు. ఎంతమంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు), పోలింగ్ సిబ్బంది అవసరమని గుర్తించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఒక్కో పోలింగ్‌స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు నలుగురు అధికారులను నియమించనున్నారు.
కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాలను జారీచేసింది. ఎన్నికల కోసం జిల్లా స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులను జారీచేసింది. బ్యాలెట్ బ్యాక్సులు, పోలింగ్ సిబ్బంది, కావాల్సిన సామగ్రి, ఇతర సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నది.