హైదరాబాద్: డయాలసిస్ పేషెంట్లకి రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నూతనంగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు (Dialysis Patients Pension) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేయూత పెన్షన్లని మంజూరు చేయనుంది.
ఈ మేరకు పెన్షన్ మంజూరు ఫైల్‌పై మంత్రి సీతక్క (Minister Seethakka) సంతకం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాకముందు 4011 మంది డయాలసిస్ పేషెంట్లకు సామాజిక పెన్షన్లని గత ప్రభుత్వం ఇచ్చింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4029 మంది డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లని మంజూరు చేసింది రేవంత్ ప్రభుత్వం.
తాజాగా మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ పేషెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్లను సెర్ప్ మంజూరు చేసింది. 681 మంది డయాలసిస్ పేషెంట్లలో.. అత్యధికంగా హైదరాబాద్‌లో 629 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 52 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరు పూర్తిస్థాయిలో పనిచేసుకోలేకపోవడంతో వారి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్‌దారులు పెన్షన్ అందుకోనున్నారు.