బీఆర్‌ఎస్‌కు బండి సంజయ్ మాస్ వార్నింగ్:

On: Monday, July 7, 2025 9:10 PM

 

జగిత్యాల, జులై 7: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్‌ఎస్ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కథనం వాస్తవమని.. తెలంగాణ కేసీఆర్ జాగీరా అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఏబీఎన్ మీద దాడి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు ఛానల్ ఉందని.. ఆ ఛానల్‌కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌ కొడుకు అహంకారం తగ్గలేదన్నారు.

వాడు వీడు అని తిడితే కేసీఆర్ కుటుంబం కార్లను కూడా తిరగనివ్వమన్నారు. రాధాకృష్ణ రాసింది ముమ్మాటికీ వాస్తవమని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణకు ముందు తెలంగాణ తరువాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి వేలకోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నదంటూ కేంద్రమంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు

‘నా కుమారుడు కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కేటీఆర్ ఓర్వలేకపోయారు. నా కుమారుడు స్థాయి కంటే కేటీఆర్‌ది తక్కువ స్థాయి. కేసీఆర్ ఉద్యమం చేయకపోయినా ఆంధ్రజ్యోతి రాసింది. కేసీఆర్ తాగి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే ఉద్యమాన్ని ఆంధ్రజ్యోతి నడిపింది. అప్పుడు ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి మంచిది అయింది. ఇప్పుడు చెడ్డది అయిందా. తెలంగాణ రావాలని కేసీఆర్‌కు ఏబీఎన్ మద్దతు తెలిపింది. ఏబీఎన్ మీద దాడి చేసి చూడు నీ బీఆర్ఎస్ భవన్‌ను ఏం చేస్తామో తెలుస్తుంది’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని స్థాయిలో ఉందని విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి. కాంగ్రెస్‌కు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు అంత ప్రేమ ఉందని నిలదీశారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

23 Jul 2025

Leave a Comment