కరెంటు, నీళ్లు ఆధునిక యుగ మనుగడలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన వనరులు. సామాన్యుడి అవసరాలు తీర్చడమే కాదు.. ఏ రంగం అభివృద్ధి అయినా ఈ రెండు వనరుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పుష్కలమైన నీళ్లు… నిరంతరాయ విద్యుత్తు అనేవి ప్రపంచంలో అభివృద్ధికి సింబల్స్‌గా మారాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కరెంటు, నీళ్లు ఆధునిక యుగ మనుగడలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన వనరులు. సామాన్యుడి అవసరాలు తీర్చడమే కాదు.. ఏ రంగం అభివృద్ధి అయినా ఈ రెండు వనరుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పుష్కలమైన నీళ్లు… నిరంతరాయ విద్యుత్తు అనేవి ప్రపంచంలో అభివృద్ధికి సింబల్స్‌గా మారాయి. వీటి పునాదులు ఎంత గట్టిగా ఉంటాయో… ఆ ప్రాంతాల అభివృద్ధికి హద్దులు ఉండవనేందుకు హైదరాబాద్ మహానగరమే ఓ ప్రబల తార్కాణం. దేశంలోని అన్ని మెట్రో నగరాలూ రెండు అంశాల్లో ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు కూడా హైదరాబాద్ నగరంలో విజయవాడ నుంచి రైల్వే వ్యాగన్లలో నీటిని తెచ్చి సరఫరా చేసిన చేదు అనుభవాలు ఉన్నాయి. కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన దృశ్యాలు కనిపించాయి. కానీ తొమ్మిదిన్నరేండ్లలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ.. హైదరాబాద్ నగరానికి వందేండ్లకు సరిపడా నీటి వనరులను సిద్ధం చేసుకోవడంతోపాటు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేలా దేశంలోనే తొలి విద్యుత్తు ఐలాండ్‌ను ఏర్పాటు చేసుకొన్నది. కానీ ఇదే సమయంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కీలకమైన ఈ రెండు వనరుల లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే హైదరాబాద్ భూములకు భారీ ఎత్తున డిమాండ్ పెరిగి.. రియల్-నిర్మాణ రంగాలు దేశంలోని ఇతర మెట్రో నగరాలను దాటి వృద్ధిని నమోదు చేస్తున్నాయి.
రెప్పపాటుకూడా కరెంట్ పోకుండా గ్రిడ్
పారిశ్రామికమే కాదు.. ప్రతి రంగం ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా అది కరెంటుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ఇతరత్రా మౌలిక వసతులతోపాటు కరెంటు పుష్కలంగా ఉన్న నగరాలవైపే అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడతాయి. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని పలు నగరాల పరిస్థితిని అంచనా వేస్తే.. కేరళలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. ఐటీ రాజధానిగా చలామణి అవుతున్న బెంగళూరు మహానగరం ప్రస్తుతం సరైన కరెంటు సరఫరా వ్యవస్థ, సరిపడేంత సబ్‌స్టేషన్ల సామర్థ్యం లేక కరెంట్‌కు కనాకష్టాలు పడుతున్నది. తమిళనాడులో డిమాండ్-సరఫరా బొటాబొటీగా ఉంది. మధ్యప్రదేశ్‌లో సైతం కరెంటు సంక్షోభం నెలకొన్నది. పుణెలో దాదాపు ఎనిమిది గంటలపాటు కరెంటు కోతలు అమలవుతున్నాయి. ఇలా అనేక నగరాలు రోజులో గంటలపాటు అంధకారంలో ఉంటున్నాయి. కానీ హైదరాబాద్‌లో ప్రస్తుతం రోజువారీ విద్యుత్తు డిమాండ్ గరిష్ఠంగా 3,400 మెగావాట్ల వరకు ఉన్నది. ఇది నాలుగు వేల మెగావాట్లకు చేరినా రెప్పపాటు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు పటిష్టమైన వనరులు, వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్‌కు చేరువలోనే 15 టీఎంసీల నిల్వతో కొండపోచమ్మసాగర్, మరికొంత దూరంలోనే 50 టీఎంసీల మల్లన్నసాగర్ కూడా ఉండటంతో హైదరాబాద్ ఇప్పుడున్న దానికంటే మరో 50-60 కిలోమీటర్లు విస్తరించినా తాగునీటిని సరఫరా చేసే సామర్థ్యం ఇప్పటికే ఉండటం సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం. తెలంగాణ ఏర్పడేనాటికి కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లో 15 రోజులకోసారి మంచినీటి సరఫరా ఉండేది. ఆ దుస్థితి నుంచి ఇప్పుడు రోజూ నీటి సరఫరాతో పాటు నగరం చుట్టూ గ్రేటర్ వెంట భారీ ట్రంక్‌మెయిన్‌తో కృష్ణా, గోదావరిజలాలను నలుమూలలా సర్దుబాటు చేసుకొనే వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు.
‘పవర్’ఫుల్‌గా హైదరాబాద్ అభివృద్ధి
హైదరాబాద్ మహానగర అభివృద్ధి నానాటికీ పురోగతిని సాధిస్తుందని స్వయానా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్తు డిమాండ్-వినియోగంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటుందని 19వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. దేశంలోని 12 ప్రధాన మెట్రో నగరాల వివరాలను పొందుపరిచిన ఈ నివేదికలో 2023-24, 2024-25లో ముంబైని అధిగమించి హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటుందని స్పష్టం చేసిందంటే నగరంలో మున్ముందు రియల్-నిర్మాణ రం గాలు ఇంకా జోరందుకుంటాయని అర్థమవుతున్నది. ప్రధానంగా విద్యుత్తు డిమాండ్, వినియోగం పెరుగుతుందంటే భూముల వినియోగం అనేది భారీ వృద్ధి నమోదు కానున్నదని స్పష్టమవుతున్నది. అంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు భారీ డిమాండ్ పెరుగుతుందని, ఇక్కడ భూములు దొరకడమనేది గగనం కాబోతున్నదని పరోక్షంగా ఈ నివేదికల ద్వారా తేటతెల్లమవుతున్నది.
పకడ్బందీ తాగునీటి వ్యవస్థ
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల తాగునీటి వ్యవస్థను తీసుకొంటే పరిమితమైన నీటి వనరులే అందుబాటులో ఉన్నాయి. చెన్నైలాంటి నగరమైతే చాలా ఏండ్లుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్నది. అందుకే బచావత్ ట్రిబ్యునల్ ద్వారా ఆ నగరానికి 15 టీఎంసీల కృష్ణాజలాలను కేటాయించారు. అయినప్పటికీ తరచూ ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా పుష్కలమైన తాగునీటిని అందించే పరిస్థితి అక్కడ లేదు. ఇప్పటికీ ఆ నగరంలో రోజుకు 505 మిలియన గ్యాలన్ల నీళ్లు కావాల్సి ఉండగా..160 మిలియన గ్యాలన్ల కొరత ఉన్నది. బెంగళూరులో రోజుకు 87.99 మిలియన్ గ్యాలన్లు, ముంబైలో రోజుకు 140 మిలియన్ గ్యాలన్లు, ఢిల్లీలో రోజుకు 73.59 మిలియన్ గ్యాలన్ల మంచినీటి కొరత ఉన్నది. కానీ హైదరాబాద్‌లో మాత్రం పుష్కలంగా నీటి సరఫరా జరుగుతున్నది. 2014లో రోజుకు సుమారు 340 మిలియన్ గ్యాలన్ల సరఫరా ఉంటే ఇప్పుడు ఏకంగా అది 643 మిలియన్ గ్యాలన్లకు చేరుకున్నది. హైదరాబాద్ ఎంత విస్తరించినా… వందేండ్ల వరకు మంచినీటికి ఢోకా లేకుండా కేసీఆర్ నీటి వనరులతో భరోసా కల్పించారు. ప్రస్తుతం పుష్కలమైన తాగునీటి సరఫరా ఉండగా.. వరుసగా మూడేండ్లు కరువొచ్చినా హైదరాబాద్ తాగునీటికి ఢోకా లేకుండా కృష్ణా, గోదావరి పథకాలను పటిష్ఠం చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే హైదరాబాద్‌కు నీటి సరఫరా జరుగుతుంది. ఇలా కాకుండా రూ.1,450 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సుంకిశాల పథకంతో సాగర్‌లో 460 అడుగుల నీటిమట్టం (డెడ్‌స్టోరేజీ) ఉన్నా సరఫరాకు ఢోకా ఉండదు. మరోవైపు గోదావరి జలాలను ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలిస్తున్నారు. కాళేశ్వర పథకంతో 365 రోజులూ ఇక్కడ పుష్కలమైన నీటి లభ్యత ఉంటుంది. నగరం ఎంత విస్తరించినా.. చుట్టూ వందల కొద్దీ టౌన్‌షిప్పులు ఏర్పాటైనా.. పుష్కలమైన మంచినీటిని అందించే వనరులు హైదరాబాద్‌కు శ్రీరామరక్షగా ఉన్నాయి.
దేశంలోనే తొలిసారిగా 2015లో తొలి పవర్ ఐలాండ్‌గా హైదరాబాద్ ఏర్పాటయింది. నగర కేంద్రంగా చుట్టూ 25 కిలోమీటర్ల పరిధిలో ఒక విద్యుత్తు గ్రిడ్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగరానికి చుట్టూ మరో 80-100 కిలోమీటర్ల పరిధిలో ఒకటి, 180-200 కిలోమీటర్ల పరిధిలో మరో ఐలాండ్‌ను ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ మూడు విద్యుత్తు ఐలాండ్ (విద్యుత్తు వలయాలు)లు ఏర్పాటయ్యాయి. దేశవ్యాప్తంగా గ్రిడ్స్ వైఫల్యం చెందినా ఇక్కడ మాత్రం కరెంటుకు అంతరాయం కలగకుండా ఆటోమెటిక్‌గా ప్రత్యామ్నాయాల ద్వారా సరఫరా కొనసాగేలా సాంకేతిక వలయాన్ని ఏర్పాటు చేశారు.
భాగ్యనగరానికి 63 టీఎంసీల భరోసా
దేశంలో ఏ మెట్రో నగరానికి కూడా లేనంత తాగునీటి కేటాయింపులు కేవలం ఒక్క హైదరాబాద్‌కే ఉండటం విశేషం. గతంలోనే హైదరాబాద్‌కు 30 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపు ఉన్నది. వాటిని సులువుగా తరలించుకొనేందుకు ఎల్లంపల్లి, నగరానికి సమీంపలోనే కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ వంటి భారీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇటు కృష్ణాజలాల్లోనూ 33 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ప్రస్తుతానికి సరఫరా సామర్థ్యం 16.5 టీఎంసీలు ఉన్నది. భవిష్యత్తులో మరో 17.5 టీఎంసీలు.. అంటే ఇప్పుడు ఉన్నదాని కంటే రెట్టింపునకు పైగా సరఫరా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నా నీటి వనరుకు ఢోకా లేదు. నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజీ స్థాయి నుంచి సుంకిశాల పథకం ద్వారా తరలింపునకు అవకాశం ఉన్నందున.. కరువు కాలంలోనూ సాగర్‌లో కనీసంగా 132 టీఎంసీల నిల్వ ఉంటుందంటే హైదరాబాద్‌కు ఎంత భరోసా ఉందో అర్థం చేసుకోవచ్చు.