ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్ – 74 కిలోల రాగి తీగలు స్వాధీనం….

On: Tuesday, July 7, 2026 5:42 PM

* ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్ – 74 కిలోల రాగి తీగలు స్వాధీనం…

A9 న్యూస్:

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్‌ను దొంగిలిస్తూ పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 74 కిలోల రాగి తీగలు, ఒక బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సేల్ ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆర్మూర్‌కు చెందిన కర్రే వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంబోల్ల ఈశ్వర్, బాజ హరిప్రసాద్, కర్తే విజయ్ కుమార్, మూల దుర్గాప్రసాద్ రెడ్డి తదితరులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి, పగటి సమయంలో స్క్రాప్ కొనుగోలు చేస్తున్న నెపంతో గ్రామాల శివార్లలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించేవారు. అనంతరం రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్‌ను దొంగిలించి, ఆర్మూర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబాకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులు వేల్పూర్, బాల్కొండ, మెండోర, భీంగల్, ఆర్మూర్, యెర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధుల్లో మొత్తం 19 చోరీ కేసుల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పాత చోరీ సొత్తు కొనుగోలు కేసుల్లో కూడా అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబాపై గతంలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం పడగల్ గ్రామ శివారులోని పాత బీటీ రోడ్డుపై రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం ఆర్మూర్‌లో స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీంను కూడా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ, విద్యుత్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, చోరీ సొత్తు కొనుగోలు చేసే వారిపైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైనా గ్రామంలోకి వస్తే వారిపైన నిఘా పెట్టాలేని తెలియజేశారు. గ్రామాలలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైనా గ్రామంలోకి వస్తే వారిపైన నిఘా పెట్టాలేని తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి శుభం నగరాలే, ఈ సందర్భంగా కేసులు చేదించిన పోలీసులను సిపి అభినందించారు. ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, రూరల్ సీఐ జాన్ రెడ్డి, వేల్పూరు సబ్ ఇన్స్పెక్టర్ సాయి కిరణ్, బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ శైలేందర్ పాల్గొన్నారు.

07 Jul 2026

Leave a Comment