*వెంటాడి.. వేటాడి…*

 

భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్‌ చేశారు. తెలంగాణ సరిహద్దు మారేడు బాక అడవుల్లో మావోయిస్టులకు.. భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా ఛత్తీస్‌గడ్, బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. తెలంగాణ సరిహద్దు మారేడు బాక, పూజారి కాంకేర్ అడవుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు హత మయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజాపూర్… సుకుమా దంతెవాడ జిల్లాల డీఅర్‌జి , కోబ్రా సీఆర్‌ఫీఎఫ్ బలగాల సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. అభూజ్ మడ్ టార్గెట్‌గా ఆపరేషన్ కగార్ జరిగింది. ఎన్ కౌంటర్ ఘటనా స్థలం చుట్టు పక్కల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

 

వెంటాడి.. వేటాడి…

 

తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో.. ఛత్తీ్‌సగఢ్‌లోని మారేడుబాక అడవుల్లో తుపాకులు గర్జించాయి. డీఆర్‌జీ, కోబ్రా బలగాలకు చెందిన వెయ్యి మంది నిర్వహించిన ఆపరేషన్‌లో.. తమకు తారసపడ్డ మావోయిస్టులను రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి.. వేటాడి కాల్చిచంపారు. పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్‌ జిల్లా పూజారికాంకేర్‌ సమీపంలోని మారేడుబాక అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు ఉప్పందింది. దీంతో.. గురువారం ఉదయం సుమారు వెయ్యి మంది డీఆర్జీ, కోబ్రా బలగాలు కూంబింగ్‌కు ఉపక్రమించాయి. ఉదయం 9 గంటల సమయంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో.. ఇరువైపులా కాల్పులు మొదలయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు కాల్పులు కొనసాగాయి. ఓ దశలో తమవైపు నష్టం జరుగుతున్నట్లు గుర్తించిన మావోయిస్టులు అడవుల్లోకి వెళ్లగా.. బలగాలు వారిని రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను, భారీగా ఆయుధాలు, మందుపాతరలను స్వాధీ నం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో తెలుగువారు ఉండిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారానికి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కాగా.. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 20 మంది నక్సల్స్‌ మృతిచెందినట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ కార్యాలయం తెలిపింది.

 

కమల్‌దాస్‌ ఉసెండీ లొంగుబాటు

 

మావోయిస్టు పార్టీలో టెక్నికల్‌ టీమ్‌ కమాండర్‌గా పనిచేస్తున్న గింజురాం అలియాస్‌ కమల్‌దాస్‌ ఉసెండీ గురువారం ఛత్తీస్‌గడ్‌లోని కొండగావ్‌ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 27 ఏళ్లుగా ఇతను నక్సల్‌బరి ఉద్యమం, మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. మిలీషియా సభ్యుడుగా కూడా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం టెక్నికల్‌ టీమ్‌ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. కమల్‌దాస్‌పై రూ.25 లక్షల రివార్డు ఉందని, ప్రభుత్వం తరఫున ఇతనికి ప్యాకేజీని అందజేస్తామని పోలీసులు వెల్లడించారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *