
A9 న్యూస్ ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీ రోడ్డు సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారానికి ఆశలు చిగురించాయి.
గురువారం ఉదయం మన వార్డు కౌన్సిలర్ విజయ్ అగర్వాల్, ఎన్‌టీఆర్ కాలనీ వాసులతో కలిసి ప్రభుత్వ సలహాదారులు, పెద్దలు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రీమియర్ బార్ పక్కన ఆర్టీసీ వారు నిర్మిస్తున్న ప్రహరీ గోడ కారణంగా ఏర్పడిన ఎన్‌టీఆర్ కాలనీ రోడ్డు సమస్యను వివరించి, రోడ్డుకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను ఎమ్మెల్యేకు అందజేశారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మిర్దాపల్లి సర్పంచ్ యాల్ల సాయరెడ్డి, వార్డు కౌన్సిలర్ విజయ్ అగర్వాల్, రిపోర్టర్ సాగర్‌తో పాటు ఎన్‌టీఆర్ కాలనీ వాసులు జాడే శ్రీనివాస్, గోనె సాయికిరణ్, చిలివేరి నవీన్, బింగి రామకృష్ణ హాజరయ్యారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్లను కలిసి సమస్యను వివరించారు. దీనికి స్పందించిన అధికారులు వెంటనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫోన్ చేసి సమస్యను తెలియజేశారు. ఎన్‌టీఆర్ కాలనీ వాసులకు రోడ్డు మార్గం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని వారు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా తమ సమస్యపై సానుకూలంగా స్పందించి, పూర్తి సహకారం అందించినందుకు ఎన్‌టీఆర్ కాలనీ వాసులు వార్డు కౌన్సిలర్ విజయ్ అగర్వాల్‌కు, మిర్దాపల్లి సర్పంచ్ యాల్ల సాయరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.







