*పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కలకలం….
*ఉపాధ్యాయుల పై చర్యలు ఉంటాయా..?
*అధికారుల పాత్రపై అనుమానాలు…
నిజామాబాద్ జిల్లా, పదో తరగతి పరీక్షల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం బయటపడింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం సంచలనం సృష్టించింది. పరీక్ష విధులు నిర్వహిస్తున్న కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాన్ని చరవాణి ద్వారా చిత్రీకరించి బయటకు పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నపత్రం తక్కువ సమయంలోనే జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా చెక్కర్లు కొట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రజల్లో ఆగ్రహం – బాధ్యులెవరు…? ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇలాంటి చర్యలకు పాల్పడడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, లేదా రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తమ పిల్లల ప్రయోజనాల కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది.
అధికారుల నిర్లక్ష్యమా…? మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో లోపాలున్నాయా..? కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన అధికారుల నిర్లక్ష్యమేనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్ష కేంద్రంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
చర్యలపై డిమాండ్… ఈ ఘటనలో బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కలెక్టర్ స్పందన కోరుతున్న ప్రజలు… ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








