తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కరీంనగర్ :
తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్, కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమ్ రెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఇటీవల మరణించిన డాక్టర్ భూమ్ రెడ్డి కుటుంబ సభ్యులను కవిత శుక్రవారం కరీంనగర్ లోని వారి నివాసంలో పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధ, డాక్టర్ రామ, డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి మీడియా తో మాట్లాడారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ గారికి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స చేసిన డాక్టర్ భూమ్ రెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్ వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. అందుకే ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ భూమ్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు.

కరీంనగర్ వైద్య పితామహుడిగా భూమ్ రెడ్డికి పేరు ఉందన్నారు. ఆయన కరీంనగర్ కే ఒక ల్యాండ్ మార్క్ ఆయన పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆనాడు మారుమూల ప్రాంతంగా ఉన్న కరీంనగర్ లో యురాలజీ, న్యూరో సర్జరీ సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారని అన్నారు. కరీంనగర్ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడానికి చల్మెడ వైద్య కళాశాల స్థాపణలోనూ కీలకంగా వ్యవహరించారని అన్నారు. రేకుర్తి కంటి ఆస్పత్రి, సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ, ఐఎంఏలోనూ విశిష్ట సేవలు అందించారని అన్నారు. వైద్యరంగంలో ఆయన సాగించిన కృషికి అనేక గోల్డ్ మెడల్స్ అందుకున్నారని తెలిపారు. డాక్టర్ భూమ్ రెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇప్పించడానికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని కోరారు.