అబూజ్మాడ్ ఎన్‌కౌంటర్: కామారెడ్డి నివాసి మావోయిస్ట్ నేత కోయి అలియాస్ ప్రభాకర్ సహా 7 మంది మృతి….

On: Friday, February 6, 2026 9:49 PM

 

గడ్చిరోలీ, ఫిబ్రవరి 6:

మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో గడ్చిరోలీ పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో సీపీఐ (మావోయిస్ట్) సీనియర్ నేత కోయి అలియాస్ ప్రభాకర్ (నివాసం: కామారెడ్డి, తెలంగాణ) సహా మొత్తం 7 మంది హార్డ్‌కోర్ మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.

ప్రభాకర్ గడ్చిరోలీ డివిజన్ కమిటీ ఇన్‌చార్జిగా, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జిగా, అలాగే కోయ్ నం.10 ఇన్‌చార్జిగా పనిచేస్తున్నాడు. అతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

గత మూడు రోజులుగా కొనసాగిన ఆపరేషన్‌లో నిన్న రాత్రి వరకు మూడు మావోయిస్టుల మృతదేహాలు లభించగా, ఈ రోజు జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో మరో నాలుగు మృతదేహాలు (2 పురుషులు, 2 మహిళలు) స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మృతుల్లో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారు. మిగిలిన మావోయిస్టుల గుర్తింపు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి 3 ఏకే-47 రైఫిళ్లు, 1 ఎస్‌ఎల్‌ఆర్, 1 .303 తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సి-60 కమాండో దీపక్ చిన్న మడవి (38) మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో ధైర్యంగా పోరాడి ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు. అయితే తీవ్ర కాల్పుల్లో గుండె భాగంలో గాయపడిన ఆయనను బామ్రాగడ్ ఉప జిల్లా ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించగా, చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. ఆయన అంత్యక్రియలు రేపు స్వగ్రామంలో పూర్తి ప్రభుత్వ గౌరవాలతో నిర్వహించనున్నారు.

మరో సి-60 జవాన్ జోగా మడవి కాల్పుల్లో గాయపడగా, ఆయనను గడ్చిరోలీకి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మరియు మావోయిస్టుల గుర్తింపు వివరాలను గడ్చిరోలీ పోలీసులు రేపు నిర్వహించనున్న ప్రెస్ మీట్‌లో వెల్లడించనున్నారు.

05 Mar 2026

Leave a Comment